- టార్పాలిన్లు అందుబాటులో ఉంచండి
- వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులకు చేరవేయండి
- సివిల్ సప్లైస్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్
- ఇప్పటివరకు 14.80 లక్షల టన్నుల ధాన్యం కొన్నట్లు వెల్లడి
- రైతుల ఖాతాల్లోకి రూ.2001.96 కోట్లు జమచేశామన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న వడ్లు తడిసిపోతున్నందున ఉన్నతాధికారులతో మంత్రి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం సెక్రటెరియట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్లు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వడ్ల కొనుగోళ్ల పురోగతిని సమీక్షించిన మంత్రి, ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లను స్పీడప్చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, దాదాపు 14.80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశామన్నారు.
ఇందులో 8 లక్షల టన్నులకు పైగా దొడ్డు రకాలు కొన్నామన్నారు. ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ జరగగా, వారి ఖాతాల్లోకి రూ. 2001.96 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వడ్ల రాక పెరుగుతున్నందున వెంటవెంటనే కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో పెద్దమొత్తంలో ధాన్యం కేంద్రాలకు వస్తున్నందున ఆయా చోట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తడిసిన ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లులకు తరలించండి..
అకాల వర్షాల కారణంగా నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద మొత్తంలో వడ్లు తడిసిపోయాయని అధికారులు మంత్రి ఉత్తమ్‌కు తెలిపారు. నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన గాలివానతో నాలుగు కేంద్రాల్లో 299 టన్నుల వడ్లు తడిసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తడిసిన వడ్లను వెంటనే పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి ఆదేశించారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో వాతావరణ హెచ్చరికల ఆధారంగా ముందుగానే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాతావరణశాఖ హెచ్చరికల ఆధారంగా ఏయే జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందో ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలన్నారు.
రెడీగా గోదాములు..
జిల్లాల్లో దాదాపు 16 లక్షల టన్నుల ధాన్యం నిల్వచేసేందుకు వీలుగా ఇంటర్మీడియెట్ గోదాములు సిద్ధంగా ఉంచినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు దాదాపు 16.8 లక్షల టన్నుల పారా బాయిల్డ్ రైస్‌కు అనుమతులు రాగా, మరో 15 లక్షల టన్నులకు అనుమతి కోరినట్లు చెప్పారు. ఇందుకోసం 18.5 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల వారీగా కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా సమస్యలు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
